Matthew 20

ద్రాక్ష తోట కూలీల కథ

1“ఎలాగంటే, పరలోకరాజ్యం ఈ విధంగా ఉంది, ఒక ఇంటి యజమాని తన ద్రాక్షతోటలో కూలికి పనివారి కోసం వేకువనే లేచి బయలుదేరాడు. 2రోజుకు ఒక దేనారం ఇస్తానని ఒప్పుకుని కొందరు పనివారిని తన ద్రాక్షతోటలోకి పంపించాడు.

3తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్ళి బజారులో ఖాళీగా నిలబడి ఉన్న కొందరిని చూసి, 4‘మీరు కూడా నా ద్రాక్షతోటలోకి వెళ్ళి పని చేయండి. ఏది న్యాయమో ఆ జీతం మీకిస్తాను’ అని వారితో చెప్పినప్పుడు వారు వెళ్ళారు.

5దాదాపు పన్నెండు గంటలకూ, తరువాత మూడు గంటలకూ, అతడు బయటికి వెళ్ళి, ఆ విధంగా చేశాడు. 6మళ్ళీ సుమారు ఐదు గంటలకు అతడు బయటికి వెళ్ళి, ఇంకా కొందరు ఊరికే నిలబడి ఉండడం చూసి, ‘మీరెందుకు రోజంతా ఇక్కడ ఖాళీగా నిలబడి ఉన్నారు?’ అని వారిని అడిగాడు. 7వారు ‘ఎవ్వరూ మమ్మల్ని కూలికి పెట్టుకోలేదు’ అన్నారు. అతడు, ‘అయితే మీరు కూడా నా ద్రాక్షతోటలోకి వెళ్ళండి’ అన్నాడు.

8“సాయంకాలమైన తరువాత ఆ ద్రాక్షతోట యజమాని తన గృహాన్ని పర్యవేక్షించే అధికారిని పిలిచి, ‘పనివారిలో చివర వచ్చిన వారితో ప్రారంభించి మొదట వచ్చిన వారి వరకూ అందరికీ వారి కూలి ఇమ్మని చెప్పాడు. 9దాదాపు ఐదు గంటలకు కూలికి కుదిరిన వారికి ఒక్కొక్క దేనారం కూలి లభించింది. 10అది చూసి ముందుగా పనిలో చేరినవారు తమకు ఎక్కువ జీతం దొరుకుతుంది అని ఆశించారు గాని వారికి కూడా ఒక్కొక్క దేనారమే ఇచ్చారు.

11
This verse is empty because in this translation its contents have been moved to form part of verse Mat 20:12.
In this translation, this verse contains text which in some other translations appears in verses Mat 20:11-Mat 20:12.
12వారు దాన్ని తీసుకుని ‘చివర వచ్చిన వీరు ఒక్క గంట మాత్రమే పని చేశారు. మేమైతే పగలంతా ఎండలో కష్టపడి పని చేశాం. కానీ వారికీ మాకూ జీతం సమానంగా ఇచ్చారేమిటి?’ అని ఆ యజమాని మీద సణుక్కున్నారు.

13అప్పుడా యజమాని వారిలో ఒకడితో, “మిత్రమా, నేను నీకు అన్యాయమేమీ చేయలేదు. నీకు జీతం ఒక దేనారం ఇస్తానని ఒప్పుకున్నాను కదా? 14నీ కూలి సొమ్ము తీసుకుని వెళ్ళు. నీకిచ్చినట్టే చివరిలో వచ్చిన వారికి కూడా ఇవ్వడం నా ఇష్టం.

15నా సొంత డబ్బును నాకిష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకునే అధికారం నాకు లేదా? నేను మంచివాణ్ణి కావడం నీకు కడుపు మంటగా ఉందా?“అని అన్నాడు. 16ఆ విధంగా చివరివారు మొదటివారూ, మొదటివారు చివరివారూ అవుతారు.”

క్రీస్తు తన మరణ పునరుత్థానాలను గురించి మళ్లీ చెప్పడం (మార్కు 10:32-34. లూకా 18:31-34. మత్తయి 12:38-42. 16:21-28. 17:22,23)

17యేసు యెరూషలేముకు వెళ్ళబోయే ముందు తన పన్నెండు మంది శిష్యులనూ ఏకాంతంగా తీసుకుపోయి, దారిలో వారితో ఇలా అన్నాడు. 18“ఇదిగో, మనం యెరూషలేము వెళ్తున్నాం. అక్కడ మనుష్య కుమారుణ్ణి ప్రధాన యాజకులకూ ధర్మశాస్త్ర పండితులకూ అప్పగిస్తారు. వారు ఆయనకి మరణశిక్ష విధించి 19ఆయనను అవమానించడానికీ కొరడా దెబ్బలు కొట్టడానికీ సిలువ వేయడానికీ యూదేతరులకు అప్పగిస్తారు. అయితే మూడవ రోజున ఆయన సజీవంగా తిరిగి లేస్తాడు.”

యాకోబు, యోహానుల తల్లి విన్నపం (మార్కు 10:35-45)

20అప్పుడు జెబెదయి భార్య తన కుమారులతో కలిసి ఆయన దగ్గరికి వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోయింది. 21“నీకేమి కావాలి?” అని యేసు ఆమెను అడిగాడు. అందుకామె, “నీ రాజ్యంలో ఈ నా ఇద్దరు కుమారులను ఒకణ్ణి నీ కుడి వైపున, మరొకణ్ణి నీ ఎడమ వైపున కూర్చోబెట్టుకుంటానని మాట ఇవ్వు” అంది.

22అందుకు యేసు, “మీరు ఏమి అడుగుతున్నారో మీకు తెలియడం లేదు. నేను తాగబోయే గిన్నెలోది మీరు తాగగలరా?” అని వారిని అడగగా వారు “తాగగలం” అన్నారు. 23ఆయన, “నా గిన్నెలోది మీరు తాగుతారు గానీ, నా కుడి వైపున, ఎడమ వైపున కూర్చోబెట్టుకోవడం నా వశంలో లేదు. నా తండ్రి ఎవరి కోసం వాటిని సిద్ధపరిచాడో వారికే అవి దొరుకుతాయి” అని చెప్పాడు. 24మిగిలిన పదిమంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు అన్నదమ్ముల మీద కోపం తెచ్చుకున్నారు.

25కాబట్టి యేసు వారిని పిలిచి, “ఇతర జాతుల్లో అధికారులు ప్రజల మీద పెత్తనం చేస్తారనీ గొప్పవారు వారిమీద అధికారం చెలాయిస్తారనీ మీకు తెలుసు. 26కానీ మీరు అలా ప్రవర్తించకూడదు. మీలో గొప్పవాడుగా ఉండాలని కోరేవాడు మీకు సేవకుడుగా ఉండాలి. 27మీలో ప్రధాన స్థానంలో ఉండాలని కోరేవాడు మీకు దాసుడుగా ఉండాలి. 28అలాగే మనుష్య కుమారుడు తనకు సేవ చేయించుకోడానికి రాలేదు. ఆయన ఇతరులకి సేవ చేయడానికీ అనేకమంది విమోచన కోసం వారి ప్రాణాలకు బదులుగా తన ప్రాణం ఇవ్వడానికీ వచ్చాడు” అని చెప్పాడు.

ఇద్దరు గుడ్డివారికి చూపు (మార్కు 10:46-52. లూకా 18:35-43)

29వారు యెరికో దాటి వెళుతుండగా గొప్ప జనసమూహం ఆయన వెంట వెళ్తూ ఉంది. 30అప్పుడు దారి పక్కనే కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గంలో వెళ్తున్నాడని విని, “ప్రభూ, దావీదు కుమారా, మమ్మల్ని కరుణించు” అని కేకలు వేశారు. 31ప్రజలు వారిని కేకలు వేయవద్దని గద్దించారు గాని వారు, “ప్రభూ, దావీదు కుమారా, మమ్మల్ని కరుణించు” అని ఇంకా పెద్దగా కేకలు వేశారు.

32యేసు ఆగి, వారిని పిలిచి, “మీకోసం నన్నేమి చేయమంటారు?” అని అడిగాడు. 33వారు, “ప్రభూ, మాకు చూపు అనుగ్రహించు” అన్నారు. యేసు వారిమీద జాలిపడి వారి కళ్ళు ముట్టుకున్నాడు. వెంటనే వారు చూపు పొంది ఆయన వెంట వెళ్ళారు.

34

Copyright information for TelULB